తిరువనంతపురం: కేరళ రాష్ట్రం ఇంకా వరద గుప్పిట్లోనే చిక్కుకొని ఉంది. కేరళలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల కారణంగా 385 మంది మృత్యువాతపడ్డారు. కేరళ వాసులను అదుకునేందుకు టాలీవుడ్ నటులు ముందుకు వచ్చారు. టాలీవుడ్ నటులు పవన్ కల్యాణ్ రూ.2 కోట్లు, అక్కినేని నాగార్జున రూ.28 లక్షలు, జూనియర్ ఎన్‌టిఆర్ రూ.25 లక్షలు, ప్రభాస్ రూ.25 లక్షలు, కల్యాణ్ రామ్ పది లక్షలు కేరళ సిఎం సహాయనిధికి అందించారు. వేలాది మంది నిరాశ్రయులను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, సైన్యం, స్వచ్ఛంద సంస్థలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇంకా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్ష సూచనతో కేరళ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2094 సహాయ శిబిరాలను రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ మదద్ పేరు గత పది రోజుల నుంచి నేవీ సేవలు అందిస్తున్నది.
కేరళలో వరద బాధితులకు చిరంజీవి, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, చిరంజీవి తల్లి అంజానాదేవి రూ. 1 లక్ష, రామ్‌చరణ్ భార్య ఉపాసన రూ.10 లక్షల విలువైన మందులను విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఫిలిం ఛాంబర్ లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరుపున రూ. 10 లక్షల కేరళ సిఎం ఫండ్ పంపించామని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా చెప్పిన విషయం విదితమే.